గత కొంతకాలంగా టాలివుడ్ లో Pan Indian రేంజ్ సినిమాల హవా బాగా నడుస్తోంది. రాజమౌళి బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాల పుణ్యమా అని.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అందరూ స్టార్ హీరోలతో Pan Indian రేంజ్ సినిమాలు లైన్లో పెట్టేశారు. దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలు ప్యాన్ ఇండియా రేంజ్ హీరోలుగా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా మన అభిమాన హీరోల ఫ్యాన్స్ వారి నెక్స్ట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. మన స్టార్ హీరోలు కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో మన సౌత్ సినీ ఇండస్ట్రీ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆసక్తికరమైన ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
Raja Saab:
అసలు ఈ మధ్య కాలంలో టాలివుడ్ నుండి ప్యాన్ ఇండియా హీరో అయిన మొదటి హీరో ప్రభాస్. ప్యాన్ ఇండియా ప్రాజెక్టులకు ఇప్పుడు ప్రభాస్ కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయిపోయారు. మరి మన డార్లింగ్ లేకుండా జాబితా ఎలా మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడనటువంటి ఎంటర్టైనింగ్ రొమాంటిక్ పాత్రలో ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో కనిపించనున్నారు. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ వచ్చే ఏడాది అంటే 2025 ఏప్రిల్ 10 న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది.
Game Changer:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ సినిమానే. ఇండియన్ 2 సినిమా తర్వాత శంకర్ దర్శకత్వం మీద కొన్ని అనుమానాలు కలిగినా.. ఈ సినిమాకి కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్ కాబట్టి మెగా ఫ్యాన్స్ కి కొంచెం ఊరట లభించింది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల కాబోతోంది.
Devara:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. జనతా గారేజ్ వంటి హిట్ సినిమా తర్వాత వీళ్ళ కాంబోలో వస్తున్న సినిమా ఇది.
Pushpa 2:
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో.. పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కాబోతోంది.
Kannappa:
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మెయిన్ సెల్లింగ్ పాయింట్ అంటే అది కచ్చితంగా ప్రభాస్ క్యామియో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా డిసెంబర్ లో భారీ సినిమాల మధ్య విడుదల కాబోతోంది.
Kanguva:
పేరుకి తమిళ్ హీరో సూర్య సినిమా అయినా.. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10 న విడుదల కాబోతోంది.
Vishwambhara:
బింబిసార ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఫ్యాంటసీ సినిమా విశ్వంభర. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 10న విడుదల కాబోతోంది.
GOAT:
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ఆసక్తికరమైన టైటిల్ తో తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సై ఫై సినిమాగా ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది.
Vettaiyan:
జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టయన్ సినిమా కూడా భారీ స్థాయిలో అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.
Lucky Bhaskar:
పేరుకు మలయాళం నటుడు కానీ అన్నీ సౌత్ భాషలలో ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దుల్కర్ నెక్స్ట్ సినిమా లక్కీ భాస్కర్ కూడా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
NTR-Neel:
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఓకే అయ్యింది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా చూడాలంటే మాత్రం వచ్చే ఏడాది కాదు ఆపై ఏడాది అంటే 2026 జనవరి 9 దాకా ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.
Thug Life:
మణి రత్నం, కమల్ హాసన్, ఏ ఆర్ రెహమాన్.. ఇలాంటి మంచి కాంబోలో వస్తున్న సినిమా అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. థగ్ లైఫ్ సినిమా. మీద కూడా అంతే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Toxic:
కేజీఎఫ్ ఫేం హీరో రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్, తారా సుతారియా, వివేక్ ఒబెరాయ్ లాంటి బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈమధ్యనే సెట్స్ మీదకి వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల అవుతుంది.
Martin:
అర్జున్ సర్జ తనయుడు ధృవ్ సర్జ హీరోగా వస్తున్న కన్నడ సినిమా మార్టిన్ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదలకి సిద్ధం అవుతోంది. అర్జున్ సర్జ స్వయంగా ఈ సినిమాకి కథ అందించారు.