కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. ఈ చిత్రంలో నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న, కునాల్ కపూర్ తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. భలేమంచిరోజు, శమంతకమణి లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో వస్తున్న సినిమా, స్టార్ హీరోలు నాగార్జున, నాని కాంబినేషన్‌లో తెరకెక్కిస్తుండటంతో దేవదాస్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను శ్రీరామ్ ఆదిత్య అందుకున్నాడా..? మల్టీస్టారర్‌గా తెరకెక్కిన దేవదాస్ సక్సెస్ అయ్యిందా..? నాగార్జున, నాని కాంబినేషన్ ఎంతవరకు వర్కవుట్ అయిందో చూడాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ
దేవ (నాగార్జున) ఓ మాఫియా డాన్. తనను తండ్రిలా ఆదరించిన పెంచిన దాదా(శరత్ కుమార్)ను ప్రత్యర్థులు డేవిడ్(కునాల్ కపూర్) గ్యాంగ్ చంపేయటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. పదేళ్ల తర్వాత దేవ బయటకు వస్తాడు. దాదాను చంపిన ముఠా కోసం హైదరాబాద్ వస్తాడు. దేవ సిటీకి తిరిగి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు ఎలాగైనా దేవాను పట్టుకోవాలని స్కెచ్ వేస్తారు. అదే సమయంలో దాదాను చంపిన డేవిడ్ గ్యాంగ్ కూడా దేవపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ దేవకు డాక్టర్ దాస్ (నాని) వద్దకు ట్రీట్‌మెంట్ కోసం వెళ్తాడు. దేవా క్రిమినల్ అని తెలిసినా పోలీస్‌లకు పట్టివ్వకుండా అతడికి వైద్యం చేసి కాపాడతాడు. దాస్ మంచితనం చూసి, దేవ అతనితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా దాస్ కూడా దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. దాస్ వల్ల దేవ మంచివాడిగా మారతాడా? లేక దేవనే దాస్ మార్చేస్తాడా? దాస్‌కు ఉన్న ప్రేమ కథలేంటి? అన్నదే మిగతా కథ
నటీనటులు
చిత్రానికి నాగార్జున, నానిల నటన హైలైట్. ఇద్దరూ తమ పాత్రలకు నూరుశాతం న్యాయం చేశారు. కింగ్ నాగార్జున మరోసారి తనదైన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరింత యంగ్‌గా కనిపించాడు. యాక్షన్, రొమాన్స్‌లతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఫుల్ ఎనర్జిటిక్ ఫెర్ఫార్మెన్స్‌తో అలరించాడు. యంగ్ హీరో నాని కూడా తనదైన నేచురల్ ఫెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే మంచి టైమింగ్‌తో కామెడీ పండించాడు. ముఖ్యంగా నాగ్, నానిల మధ్య వచ్చే సన్నివేశాల్లో వారిద్దరి కెమిస్ట్రీ సినిమాను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చింది. సినిమా అంతా దేవ, దాస్‌ల చుట్టూనే తిరగడంతో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత లేదు ఉన్నంతలో ఆకాంక్ష సింగ్, రష్మికలు ఆకట్టుకున్నారు. ఇద్దరూ అతిథి పాత్రల్లాగే కనిపిస్తారు. విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఆ పాత్రను పెద్దగా ఎలివేట్ చేయలేదు. ఇతర పాత్రల్లో నరేష్, వెన్నెల కిశోర్, సత్య, మురళీశర్మ, అవసరాల శ్రీనివాస్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ
కథాపరంగా ప్రయోగాలు ఏమీ చేయకుండా అందరికీ తెలిసిన మామూలు కథనే ఎంచుకున్నారు. ఇద్దరు హీరోల నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఆశించేదేమిటో వాటన్నిటినీ మేళవించి తెరకెక్కించారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. హాలీవుడ్ సినిమాకు స్ఫూర్తి కూడా అనుకోవచ్చు. ఇంతవరకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం లేకపోయినా.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దేవదాస్‌ను బాగానే డీల్ చేశాడు. తను అనుకున్న కథకు తెర రూపం ఇవ్వటంలో విజయం సాధించాడు. ఫస్ట్ హాఫ్ దేవ, దాస్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్, కామెడీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రాణాపాయంలో ఉన్న ఓ డాన్‌ను, నిజాయితీపరుడైన, మంచివాడైన ఓ డాక్టర్ కాపాడితే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం, ఆ స్నేహం వారిద్దరి జీవితాలపై ప్రభావం చూపించడం బాగుంది. నాగార్జున, నాని మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా, ఆద్యంతం నవ్వుకునేలా సాఫీగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో సినిమా ఒకేసారి సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్తుంది. కాస్త భారంగా సాగుతుంది. కథలో ఎలాంటి మలుపులు కనబడవు. ఇద్దరు హీరోలను యువ దర్శకుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడనిపిస్తుంది. వైజయంతి మూవీస్ చిత్రం కాబట్టి సినిమాలో ఆ భారీతనం ఉట్టిపడింది.
హైలైట్స్
నాగార్జున, నాని మధ్య సన్నివేశాలు
సంగీతం, సినిమాటోగ్రఫి
డ్రా బ్యాక్స్
కథలో మలుపులు లేకపోవడం
సెకండాఫ్ కథనం కాస్త నెమ్మదించడం
చివరిగా : ఫైనల్‌గా ఇది కామెడీ ఎంటర్ టైనర్
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
టైటిల్ : దేవదాస్
నటీనటులు : నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న, కునాల్ కపూర్
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత : అశ్వనీదత్