ప్రముఖ సినీ నటుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. దేవదాస్ కనకాల 1945లో జులై 30న యానాంలో జన్మించారు. ఆయన స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యనభ్యసించిన తొలితరం నటుడైన దేవదాసు కనకాల అనంతరం.. నటనా శిక్షణా సంస్థను నెలకొల్పారు. ఆయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ.
సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్ నటించారు. చివరగా భరత్ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. ప్రముఖ నటులు రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, భానుచందర్, రఘువరన్, నాజర్, తదితర ఎంతో మందిని దేవదాస్ వద్దే శిక్షణ పొందారు. అలాంటి మరెందరినో నటులుగా తీర్చిదిద్ది తెలుగు సినీ పరిశ్రమకు అందించిన ఆయనది సినీ ప్రస్థానంలో ఓ ప్రత్యేక అధ్యాయం. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల, కోడలు సుమ చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించారు. ఇటీవల దేవదాస్ సతీమణి మృతిచెందడం ఆయనను ఎంతో కలిచివేసింది. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురవ్వడంతో ఇటీవల ఆయనను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతిచెందినట్టు రాజీవ్ కనకాల వెల్లడించారు. దేవదాస్ కనకాల మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ నటులు కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.