కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ‘ఏపీ రాజకీయాల్లో తలపండిన వాళ్ల ఇళ్లకు వెళ్లాను, దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్లాను. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్‌కు పూర్వం నుంచి ప్రత్యేక ప్రేమాభిమానం. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు సంజీవయ్యను సీఎంగా చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అప్పుడు కొంతమంది ఆయనపై అవినీతిపరుడని నెహ్రూ వద్ద ఆరోపణలు చేశారు. అప్పుడు నిజాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని సంజీవయ్య ఇంటికి పంపారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం కర్నూలు జిల్లాలోని సంజీవయ్య స్వగ్రామం పెదపాడు వచ్చారు. ఒక ముసలావిడ కట్టెలపొయ్యి మీద వంట చేస్తుండగా ఆ బృందం అక్కడికి వెళ్లింది. సంజీవయ్య ఇల్లు ఎక్కడ? అని అడిగితే కట్టెలపొయ్యి మీద వంట చేస్తున్న ఆ ముసలావిడ ఇదే సంజీవయ్య ఇల్లు అని చూపించింది. నేనే సంజీవయ్య తల్లిని అని చెప్పింది.
ఆ తరువాత ఢిల్లీ వెళ్లిన పరిశీలకుల బృందం సంజీవయ్య అవినీతిపరుడంటే నమ్మడానికి ఏమీ లేదని చెప్పింది. ఆ తరువాత వారం రోజులకు ప్రధాని నెహ్రూ.. సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించారు. ఇప్పుడు అంధ్రప్రదేశ్‌కు సంజీవయ్య లాంటి ముఖ్యమంత్రి కావాలి. నిజాయతీగా ప్రజల కోసం పనిచేసే వారే ముఖ్యమంత్రి కావాలి. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ భారతదేశానికి దిక్సూచి. విభజన సమయంలో ఏపీ అభివృద్ధికోసం కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. అనాడు ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. మన్మోహన్ ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. కాదు.. కాదు. పదేళ్లు కావాలని బీజీపీ నేతలు అడిగారు. కానీ ప్రత్యేక హోదా హామీ నెరవేర్చకుండా బీజేపీ మోసం చేసింది’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.