నువ్వు రికార్డు చేస్తున్నావా? హాలో గాయిస్.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి (షార్ట్) దుస్తులు ధరించారు. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకు ఈ లేడీస్ షార్ట్ డ్రెస్సెస్ ధరిస్తున్నారు.. ఢిల్లీలో కొందరు యువతులను ఉద్దేశించి ఓ మధ్యవయస్కురాలైన మహిళ పేర్కొన్న వ్యాఖ్యలివి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసకు వారి వేషధారణే కారణమంటూ.. దేశంలో నెలకొన్న అత్యాచారాల సంస్కృతిని సమర్థించే కిరాతక మనస్తత్వానికి అద్దం పడుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నేను, నా స్నేహితులు ఒక రెస్టారెంట్‌లో స్నాక్స్ తింటుండగా.. ఓ మహిళ నా వద్దకు వచ్చి.. పొట్టిగా ఉన్న దుస్తులు వేసుకున్నందుకు సిగ్గుపడు అంటూ పేర్కొంది. నేను, నా స్నేహితులు ఆమెతో వాదనకు దిగాం. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఇలాంటి దుస్తులు వేసుకున్న మహిళలను అవకాశం వచ్చినప్పుడల్లా రేప్ చేయాలంటూ రెస్టారెంట్‌లో ఉన్న పురుషులకు ఆమె చెప్పింది. దీంతో షాక్ తిన్న మేం సమీపంలో ఉన షాపింగ్‌మాల్ వరకు ఆమెను వెంటాడుతూ.. ఆమె వికృత మనస్తత్వాన్ని ప్రశ్నిస్తూ.. వీడియో తీశాం’ అని ఓ యువతి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియోలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పదేపదే యువతులు కోరినా.. సదరు మధ్య వయస్కురాలైన మహిళ పెద్దగా పట్టించుకోలేదు. అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడే హక్కు లేదని, వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా ప్రశ్నించడానికి నువ్వు ఎవరని ఓ మహిళ ఆమెతో వాదనకు దిగారు. పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధురాళ్ల వరకు దేశంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, అలాంటి సమయంలో ఇలా దుస్తులు, వేషాధారణ గురించిన నీచమైన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివారిని పురుషులు రేప్ చేయాలని పేర్కొనడం దారుణమని ఆ మహిళ మండిపడ్డారు. అయినా ఏ మాత్రం వెనుకకు తగ్గని ఆమె.. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకే ఇలాంటి దుస్తులు వేసుకుంటున్నారని వీడియో చివరలో పేర్కొనడం గమనార్హం. పది నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో తీసిన యువతి వివరాలు పెద్దగా తెలియరాలేదు.