దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు పటియలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఆదేశాల ఇచ్చే వరకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలని ఆదేశించింది.
ఢిల్లీ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శనివారం (ఫిబ్రవరి 1న) ఉదయం ఆరు గంటలకు నలుగురు దోషులకు ఉరితీయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరో దోషి వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. దీంతో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ గురువారం పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి డెత్ వారెంట్‌పై స్టే విధిస్తూ ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది.