Delhi Chief Minister Kejriwal arrested: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం రెండు బృందాలుగా ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న అధికారులు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సోదాలు జరిపారు. కేజ్రీవాల్ ను అధికారులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పలు డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు.
ఒక కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తొలి రాజకీయ నేత అరవింద్ కేజ్రీవాల్ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ కేసులో ఇది నాలుగో అరెస్ట్. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తదితరులను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసినా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేస్తే జైలు నుంచి ఢిల్లీ నుంచి పరిపాలన సాగిస్తారని చెప్పారు.