బాలీవుడ్ నటి దీపిక పదుకొణె ‘పద్మావత్’ చిత్రం తర్వాత చాలా రోజుల పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇంకా ఆమె తన తదుపరి సినిమా గురించి ప్రకటించలేదు. కాగా హీరో రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకోబోతున్నారని.. అందుకే సినిమాలకు ఒప్పుకోవడంలేదని గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు దీపిక తదుపరి సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వంలో దీపిక నటించబోతున్నారు.
ఈ చిత్రంలో లక్ష్మి అగర్వాల్ అనే 32 ఏళ్ల యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో దీపిక నటించనున్నారు. ఓ కిరాతకుడి కారణంగా అతలాకుతలమైపోయిన ఓ మహిళ జీవితాధారంగా తీస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడానికి దీపిక ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈ కథ విన్నాక నేనెంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఇది కేవలం పోరాటానికి సంబంధించినదే కాదు ఆశ, విజయం నేపథ్యంలో సాగే కథ. ఈ కథ నాపై ఎంత ప్రభావం చూపిందంటే కేవలం యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించడమే కాకుండా నావంతు ఇంకేదన్నా చేయాలని అనిపించింది. అందుకే ఈ సినిమా కోసం నిర్మాతగా మారాను.’ అని వెల్లడించారు.
2005లో లక్ష్మి దిల్లీలోని ఓ బస్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యాడు. తనను పెళ్లి చేసులేదన్న కారణంగా అతను ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడి జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో యాసిడ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.