యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛపాక్’. అందం అనేది బయటకు కనిపించేది కాదు.. మనసుకు సంబంధించిందని చెబుతూనే.. యాసిడ్ దాడి బాధితులు సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులు గురించి తెలియజేసిన చిత్రమిది. మేఘనా గుల్జర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయించాయి. ఛపాక్ విడుదలకు ముందు జేఎన్‌యూ విద్యార్థులకు ఆమె సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ‘ఛపాక్’ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. దీంతో ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్ తగ్గింది. దీపిక నటించిన ‘ఛపాక్’ చిత్రానికి ఐఎండీబీ 4.6 రేటింగ్ వచ్చింది. ఐఎండీబీ నిర్వహించిన ఓటింగ్‌లో కేవలం 31.1 శాతం మంది మాత్రమే ‘ఛపాక్’ చిత్రానికి 10 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 56.8 శాతం మంది నెటిజన్లు 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా దీపిక ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొని ఐఎండీబీ రేటింగ్‌పై స్పందించారు. ‘నెటిజన్లు నా ఐఎండీబీ రేటింగ్‌ను మార్చొచ్చు. కానీ నా మైండ్‌ను మార్చలేరు’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీపిక తనదైన శైలిలో దీటుగా సమాధానం చెప్పారంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.