బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోనేకి అరుదైన గౌరవం దక్కింది. అందుకే ఆమె భర్త, హీరో రణ్‌వీర్ సింగ్ ‘వావ్’ అంటున్నారు. ఇక ఆమె అభిమానులైతే ‘మన దేశీ అమ్మాయి మనకు గర్వకారణంగా నిలిచింది’ అని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈ ప్రశంసలు ఎందుకంటే.. ప్రతిష్ఠాత్మక కాన్స్ చలన చిత్రోత్సవాల్లో దీపికా పదుకోన్ జ్యూరీ మెంబర్‌గా ఎంపికయ్యారు. ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు ఎనిమిది మంది నటీనటులు, దర్శకులు జ్యూరీలో ఉంటారు.
ఈ 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు మే 10 నుంచి 28 వరకు జరగనున్నాయి. మొత్తం 21 చిత్రాలు చూసి, ఒక చిత్రాన్ని అవార్డుకి ఎంపిక చేస్తారు. మే 28న అవార్డు ప్రదానం జరుగుతుంది. కాగా ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో జరిగే ఈ చిత్రోత్సవాల్లో 2010 నుంచి దీపికా పాల్గొంటున్నారు. రెడ్ కార్పెట్‌పై వీలైనంత ఆకర్షణీయంగా కనిపించి, మార్కులు కొట్టేశారు. ఇప్పుడు జ్యూరీ సభ్యురాలి హోదాలో వెళ్లనున్నారు.