ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ నటిని గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె..! ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ బయోపిక్‌లో దీపిక నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఛపాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్‌లుక్‌ను దీపిక ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘ఈ పాత్ర నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ‘ఛపక్’ సినిమా చిత్రీకరణ ఈరోజు నుంచే మొదలు’ అని పేర్కొన్నారు. దీపిక లుక్‌ను విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే మూడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ఇందులో దీపిక మాలతి అనే పాత్రలో నటిస్తున్నారు. అయితే లక్ష్మీ అగర్వాల్ బయోపిక్ అయినప్పుడు పాత్ర పేరు మార్చడం గమనార్హం. ‘రాజీ’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ మస్సే దీపికకు జోడీగా నటిస్తున్నారు. సినిమాను దీపిక కూడా నిర్మిస్తున్నారు. 2020 జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.