తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజూ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ తాజాగా 10 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1132కి చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకుని 727 మంది డిశ్చార్జి కాగా ఇవాళ ఒక్కరోజే 34 మంది డిశ్చార్జి అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది మాత్రమే చికిత్సపొందుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 75 ఏళ్లు దాటిన వ్యక్తి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపారు. డయాలసిస్ రోగి కూడా కోలుకున్నారని, కరోనా సోకిన గర్భిణి సైతం గాంధీ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడించారు. తెలంగాణలో 14 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లేవని, వాటిని గ్రీన్ జోన్లుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు.