బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దే దే ప్యార్‌దే’. ఈ చిత్రానికి అకీవ్ అలి దర్శకత్వం వహించారు. ఈరోజు అజయ్ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 50 ఏళ్ల అజయ్ తన భార్య టబుతో విడిపోయి ఒంటరిగా ఉంటాడు. ఆయనకు 26 ఏళ్ల రకుల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమపుడుతుంది. రకుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న క్రమంలో టబు మళ్లీ అజయ్ జీవితంలోకి వస్తుంది. అలా మాజీ భార్య, ప్రేయసి మధ్య అజయ్ ఎలా ఇరుక్కున్నారు? అన్నదే కథ. అన్ని వర్గాలు వారు చూడగలిగే రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.