HomeTelugu Big Storiesడేటా చోరీ కేసులో ఇద్దరు చంద్రులు ఢీ అంటే ఢీ

డేటా చోరీ కేసులో ఇద్దరు చంద్రులు ఢీ అంటే ఢీ

3 5

డేటా చోరీ వ్యవహారంలో సైబారాబాద్‌ పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇందులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఐటీ గ్రిడ్‌ ఇండియా డైరెక్టర్‌ అశోక్‌ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అశోక్‌ విచారణకు హాజరైతే ఇందులోని కీలక విషయాలు తెలుస్తాయని అంటున్నారు తెలంగాణ పోలీసులు. దీంతో అశోక్‌ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అశోక్‌ ఏపీలో తలదాచుకున్నాడని అనుమానిస్తున్న పోలీసులు ఏపీకి రెండు బృందాలను పంపించినట్లు తెలుస్తోంది.

డేటా చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్పీసీ 161 సెక్షన్‌ కింద అశోక్‌కు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. నోటీసులు అందడంతో అప్రమత్తమైన అశోక్‌ 27న తన కార్యాలయ కంప్యూటర్లలోని కొంత సమాచారం తొలగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అశోక్‌ చిక్కితేనే ఆంధ్ర ప్రజల డేటా ఎలా సమకూరింది? ఎవరైనా ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందా? ఉన్నతాధికారులెవరైనా సహకరించారా? ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేశారా? అనే అంశాలపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైప్‌ ఐటీ గ్రిడ్‌ డేటా కేసు రాజకీయంగా మరింత వేడి పెంచుతోంది. తెంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది. వైసీపీకి ఫేవర్‌ చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా అదేస్థాయిలో కౌంటర్‌ ఇస్తున్నారు. దీంతో డేటా కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

డేటా వ్యవహరంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వ అనవసర జోక్యాన్ని తీవ్రంగా పరిగణించాలని తాడోపేడో తేల్చుకోవాలని ఏపీ కేబినేట్‌ నిర్ణయించింది. ఒక ప్రభుత్వ వ్యవహారాల్లో మరో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినేట్‌ సమావేశంలో ఈ అంశాలపై తీవ్రంగా చర్చ జరిగింది. అంశాన్ని తేలిగ్గా విడిచి పెట్టేది లేదని…ఎంతవరకైనా వెళదామని, న్యాయ నిపుణులు, సీనియర్‌ మంత్రులతో మరోసారి చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిద్దామని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది.

డేటా చోరీ కేసులో తెలంగాణ పోలీసులు అప్రజాస్వామికంగా, చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్నారని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. మీడియా సమావేశంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్ మాట్లాడిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ రాజకీయనాయకుడిలా సజ్జనార్‌ మాట్లాడారని…ఓ పోలీస్‌ అధికారిగా తన పరిధి దాటి వ్యహరించారని..ఆయనపై చట్టపర చర్యలు తీసుకుంటామని అంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐటి గ్రిడ్స్‌ చోరీ కేసు సంచలనం సృష్టిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu