Dasari Narayana Rao birth anniversary: తెలుగు తెరపై దర్శకరత్న దాసరి నారాయణరావుది ఓ చెరిగిపోని సంతకం. సినిమా అనేది ఒక కళ. ఈ రంగంలో రాణించాలంటే ముందుగా అవకాశాలు రావాలి. కానీ అతి సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు దొరకడం చాలా కష్టం. అయినా మనిషికి సంకల్పం ఉంటే అదేమీ అసాధ్యం కాదని తెలుగు సినీ రంగంలో అనేకమంది నిరూపించారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, దర్శక దిగ్గజం, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, పత్రికాధిపతిగా ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేశారు.
దాసరి నారాయణరావు 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆయన తండ్రి సగటు జీవి. చాలీచాలని సంపాదన, అయినా దాసరిలో చదువుకోవాలన్న తపన ఉండేది. చిన్నతనంలోనే పనిచేస్తూ చదువుకున్నారు. హైస్కూల్ రోజుల్లోనే నాటకాలు రాసి, నటించి మెప్పించారు. డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే పంథాలో సాగారు. చదువులో తెలివైన వారు కావడంతో హైదరాబాద్ హెచ్.ఏ.ఎల్. సంస్థ పెట్టిన పరీక్షలో నెగ్గి టైపిస్ట్ గా ఉద్యోగం సంపాదించారు. బాలనగర్ లో ఉద్యోగం చేస్తూనే రవీంద్రభారతిలో నాటకాల వేసేవారు. అలా ఓ సినిమా వ్యక్తి ప్రోత్సాహంతో అమాయకంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, మద్రాసు వెళ్ళారు.
అక్కడ ఆరంభంలోనే ఓ చిన్న వేషానికి మాత్రమే పాత్రులయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలి అన్న సంకల్పంతో చిత్రసీమలోనే ఉంటూ కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొందరికి ఘోస్ట్ రైటర్ గానూ ఉన్నారు. పాలగుమ్మి పద్మరాజు పరిచయంతో ఆయనతో కలసి పలు సినిమాలకు పనిచేశారు. రచయితగానూ మంచి పేరు సంపాదించారు. ఫల్గుణ ఫిలిమ్స్ అపరాధ పరిశోధన చిత్రాలకు తనదైన శైలిలో మాటలు రాసి అలరించారు. తెలుగునాట ‘గూట్లే, డోంగ్రే’ వంటి పదాలకు విశేషాదరణ లభించేలా చేసింది దాసరి కలం.
ఫల్గుణలో పార్ట్ నర్ గా ఉన్న కె.రాఘవ బయటకు వచ్చి ‘ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్’ స్థాపించారు. దాసరిని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘తాత-మనవడు’ నిర్మించారు. తొలి చిత్రంతోనే దాసరి నారాయణ రావుకు ఎంతో పేరు లభించింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. దాసరి ఎందరు టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా, నటరత్న ఎన్టీఆర్ తోనే ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ అని చెప్పాలి. నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన ‘మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి’ చిత్రాలన్నీ శతదినోత్సవాలు చూశాయి. వాటిలో.. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
ఎన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన అన్ని చిత్రాలలోనూ నటరత్న నటనావైభవం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది. ఆ వైనాన్ని ఈ నాటికీ ఎవరూ మరచిపోలేరు. దేవదాసు సినిమా చూసిన దాసరి అక్కినేని వీరాభిమానిగా మారిపోయారు. ఏయన్నార్ తో దేవదాసు మళ్ళీ పుట్టాడు మూవీని అని తెరకెక్కించారు. ఈ సినిమా పెద్దగా మెప్పించకపోయిన దాసరిలోని క్రియేటివిటీని చూసి జనం మెచ్చుకున్నారు. తరువాత పలు చిత్రాలలో తన అభిమాన నటునితో పయనించి ఆకట్టుకున్నారు.
వాటిలో అన్నిటికన్నా మిన్నగా అలరించిన చిత్రం ప్రేమాభిషేకం అనే చెప్పాలి. ఇందులో అక్కినేని అభినయం, దాసరి దర్శకత్వం తెలుగువారిని విశేషంగా మురిపించాయి. టాప్ స్టార్స్ తో సినిమాలు తీసినా, వారిలోని నటనకే దాసరి ప్రాధాన్యమిచ్చేవారు తప్ప, కమర్షియల్ హంగులతో కనికట్టు చేయాలని ఏ నాడూ తపించలేదు. దాసరి చిత్రాల్లో ఏముంటుంది? అంటే మనసులు తాకే కథ ఉంటుంది. ఆలోచింప చేసే మాటలు ఉంటాయి. ఆకట్టుకొనే పాటలు ఉంటాయి. నిజమే, ఆయన తెరకెక్కించిన చిత్రాలలో అవన్నీ చోటు చేసుకొని సినిమా చూసిన ప్రేక్షకుణ్ణి ఇంటిదాకా వెంటాడేవి.
మళ్ళీ మళ్ళీ సినిమా థియేటర్ కు వచ్చేలా చేసేవి. అదీ దాసరి ప్రతిభలోని మహత్తు. దాసరి తొలి చిత్రం తాత-మనవడు.. మొదలు, దాదాపు ఆయన తెరెక్కించిన అన్ని చిత్రాలలోనూ మహిళలు నిత్యం ఎదుర్కొనే సమస్యలను ఏదో విధంగా చొప్పించేవారు. ఆ సమస్యలను ఎదుర్కొనేందుకు తగిన మార్గాలూ చూపించేవారు. అందుకే ఆ రోజుల్లో దాసరి సినిమాలకు మహిళా ప్రేక్షకులు పోటెత్తేవారు. ఒకటా రెండా, 151 చిత్రలను తెరకెక్కించారు దాసరి. ఆయన చిత్రాలలో అన్నీ విజయం సాధించి ఉండక పోవచ్చు. కానీ, అన్నిటా ఎక్కడో ఓ చోట మనసును తడిచేసే సన్నివేశాలను చొప్పించేవారు.
దాసరి చిత్రాల ద్వారా ఎందరో చిత్రసీమలో తమ ఉనికిని చాటుకున్నారు. కొందరు స్టార్స్ గానూ ఎదిగారు. ఇక చిత్రసీమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, దాని పరిష్కారానికి దాసరి ముందుండేవారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేవారు. ఆపన్నులను ఆదుకోవడానికి దాసరి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. అర్ధరాత్రి ఆయన దగ్గరకు వెళ్ళినా, తగిన న్యాయం జరగుతుందని సినిమా జనం భావించేవారు. అందుకే దాసరిని ‘అందరివాడు’ అని ఈరోజుకి జనం చెప్పుకుంటున్నారు.
ఎన్నో మరపురాని చిత్రాలను తెలుగువారికి అందించిన దాసరి నారాయణరావు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ కొన్ని చిత్రాలు రూపొందించారు. ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులూ, రివార్డులూ రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. నేడు దాసరి లేరు. ఆ లోటును ఎవరూ భర్తీ చేయలేరు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే ఓ అద్భుతంగా నిలచిన దాసరి తెలుగువారి మదిలో సదా నిలచే ఉంటారు. ఎందరి మదిలోనో గురువు గారుగా కొలువై ఉన్నారు. ఇక తెలుగు సినిమా రంగానికి పెద్దాయన గానూ ఆయన తనదైన బాణీ పలికించారు. ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని సినీజనం అంటూనే ఉన్నారు.
ఆయన భౌతికంగా దూరమై అయిదేళ్ళయింది. అయినా ఇంకా దాసరి మనమధ్య ఉన్నట్టే భావిస్తున్నారు అభిమానులు. ఆయన సినిమాల ద్వారానే ఎంతోమంది చిత్రసీమలో స్థిరపడిపోయారు. అందుకే దాసరి నారాయణరావు అంటే తెలుగువారికి ఓ ప్రత్యేకమైన అభిమానం. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలయితే చాలు, జనాల్లో ఆసక్తి రేకెత్తేది. ఇక ఆయన సినిమా వచ్చిందంటే చాలు జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆయన బహుముఖ ప్రజ్ఞ మనలను పలకరిస్తూనే ఉంటుంది.
44 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగి ఎంతోమందికి సినీ జీవితాన్ని ప్రసాదించడంతో పాటు పరిశ్రమకు పెద్దదిక్కుగా కొనసాగిన దాసరి నారాయణరావు జయంతి (మే – 04)ని డైరెక్టర్స్‌డేగా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నిర్ణయించి, సెలబ్రేట్ చేస్తోంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున వేడుకలు చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన ఒక భారీ వేడుక వాయిదా పడింది కానీ ఈరోజు ఫిలిం చాంబర్లో దర్శకుల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరపబోతున్నారు.