నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పక్కింటి అబ్బాయిలా.. ఫ్యామిలీ కథలతో.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదగబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని చాలా మాస్‌గా కనిపించాడు. తెలంగాణ యాసలో ఎప్పుడూ చేయని విథంగా చాలా కష్టపడ్డాడనే చెప్పాలి. ఈ మూవీ ప్రమోషన్స్‌లో కూడా నాని ఎన్నడూ లేని విధంగా పాల్గొన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా హీరోగా ఎదగాలి అని ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌నే క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుందో చూద్దాం….
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. అనుభవం లేని కొత్త దర్శకుడితో నాని పాన్ ఇండియా సినిమా చేస్తున్నడేంటి..అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే నాని అతనిపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలంతా స్టార్ డైరెక్టర్‌లతో సేఫ్ గేమ్ ఆడుతుంటే.. నాని మాత్రం కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. అవకాశం ఇవ్వడమే కాదు. కొత్త దర్శకుడితోనే పాన్ ఇండియా రేంజ్‌లో తలపడటం అంటే అతని గట్స్‌కి మెచ్చుకోవాల్సిందే. అందరికీ తెలిసిన కథే.. అందరూ చూసిన కథే ఈ ‘దసరా’. జగడం, పుష్ప, రంగస్థలం, పలాస, ఉప్పెన తరహాలో ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ రివేంజ్ స్టోరీనే ‘దసరా’.
వృత్తిపరమైన ఆధిపత్యం, హీరో తిరుగుబాటు, ప్రతి రివేంజ్ కథలోనూ రొటీన్‌గా కనిపిస్తాయి. దసరా కూడా ఆ తరహా కథే అయినా.. పాత్రల చిత్రణతో రొటీన్ ప్లాట్‌ని ఎంగేజింగ్ డ్రామాగా చూపించడంతో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. వీర్లపల్లి అనే కల్పిత గ్రామంలో వాస్తవిక పాత్రలు చూపించడం దర్శకుడి మేథోశక్తికి అద్దం పడుతుంది. అన్నగారు ఎన్టీఆర్ మద్య నిషేదం ప్రకటించిన రోజులు.. అంటే దాదాపు మూడు దశాద్దాల క్రితం నాటి సామాజిక పరిస్థితులకు అద్ధం పట్టేలా ‘దసరా’ కథను రాసుకున్నాడు దర్శకుడు. కుల వివక్ష, పెత్తందారీతనం, దొరల కామదాహం నాటి వాస్తవ పరిస్థితుల్ని కళ్లకి కట్టాడు.
కథలో ఊహాతీతమైన ట్రిగ్గర్ పాయింట్ ఏదీ ఏమీ లేకపోయినా.. బలమైన సన్నివేశాలు… పదునైన సంభాషణలతో రక్తికట్టించేట్టు చేశాడు. నాని, కీర్తి సురేష్ లాంటి నాచురల్ స్టార్స్ దొరకడంతో రెగ్యులర్ సెటప్‌కి డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఇచ్చాడు దర్శకుడు. రియలిస్టిక్ అండ్ రస్టిక్ ఎమోషనల్ డ్రామా రుచి చూపించారు. రక్తం ఏరులై పారినట్టే.. మద్యం కూడా ఏరులై పారించాడు దర్శకుడు. మందు అనేది మా వ్యసనం కాదు.. ఇది మా ఆచారం అని తెలంగాణ సాంప్రదాయానికి దర్శకుడు ఇచ్చిన జస్టిఫికేషన్ బాగుంది కానీ.. సిల్క్ బార్ నేపథ్యంలో తాగుబోతు సీన్లు కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి. తొలి 30 నిమిషాలు కాస్త గందరగోళంగానే అనిపిస్తాయి.
అయితే రస్టిక్ బ్యాగ్ డ్రాప్ సినిమాకి కొత్త ఫ్లేవర్‌ని తీసుకొచ్చింది. ఈ విషయంలో అనుభవం ఉన్న దర్శకుడిలా టెక్నికల్ వాల్యూస్‌ని ఉపయోగించుకున్నాడు దర్శకుడు. ప్రెసిడెంట్ ఎన్నికలు.. కులాధిపత్యం.. స్నేహితుడి మరణం.. ఇవన్నీ రంగస్థలం సినిమా చూస్తున్నట్టు ఉంటుంది సినిమా మొదట్లో. అయితే ప్రీ ఇంటర్వెల్ సీన్‌తో సినిమా సేఫ్‌లోకి వచ్చేస్తుంది. ఆ తరువాత నుంచి దసరా ఉత్సవం అన్నట్టుగా సాగుతుంది. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాతో నడిపించి.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు సినిమాని నిలబెట్టాయి. ముఖ్యంగా విలన్‌ని అంతమొందించే సీన్ కానీ.. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్.. వాళ్ల పెళ్లి ట్విస్ట్.. ఊహకి అందనట్టే ఉంటాయి.
ప్రమోషన్స్‌లో భాగంగా.. నాని ఈ సినిమా గురించి చెప్తుంటే.. కాస్త ఎక్కువ చెప్తున్నాడే అనిపించింది. కానీ ధరణి పాత్రలో విశ్వరూపం చూపించాడు. ఇంత ఊర మాస్‌గా లుక్‌లో నాని కనిపించడం ఇదే తొలిసారి. ఏదైతే మాస్ ఇమేజ్ కోసం నాని ఆరాటపడుతున్నాడో.. ధరణి పాత్రతో ఆ లోటుని పూర్తిగా తీర్చేసుకున్నాడు. వెన్నెల పాత్రే ఈ సినిమాకి మెయిన్. మొదట్లో సాదాసీదాగా ఆ రంగస్థలంలో సమంతలా.. పుష్పలో రష్మికలా అనిపిస్తుంది కానీ.. కథలోకి వెళ్లే కొద్దీ.. వెన్నెల పాత్రను మరింత ప్రకాశవంతం చేశారు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది కీర్తి సురేష్. డీగ్లామరస్‌గా కనిపించి.. వెన్నెల పాత్రలో ఒదిగిపోయింది. ఫస్టాఫ్‌లో పిల్లల గుడ్లు దొబ్బేసే అంగన్ వాడీ టీచర్‌గా చాలా అల్లరిగా కనిపించి.. సెకండాఫ్‌లో ఎమోషన్ పిండేసే పాత్రలో వేరియేషన్స్ చూపించింది.
ప్రీ ఇంటర్వెల్ ముందు.. తరువాత సీన్‌లలో ‘మహానటి’ని మళ్లీ గుర్తు చేసింది కీర్తి సురేష్. పరిణితి ఉన్న ఇద్దరు నటులు పోటీ పడి చేసినట్టు ఉంటాయి నాని, కీర్తి సురేష్ కాంబోలోని ఎమోషనల్ సీన్లు. కీర్తి సురేష్, నానిలకు ఇది పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ. ధరణి, వెన్నెల పాత్రల్లో ఒదిగిపోయారు. కళ్ల ముందే స్నేహితుడు తల ఎగిరిపడినప్పుడు సౌండ్ పైకి రాకుండా ఏడ్చే సీన్‌లో నాని.. పెళ్లైన తొలిరోజే భర్త చనిపోయి గుండెలు అవిసేలా రోదించే సీన్‌లో కీర్తి సురేష్ జీవించేశారు.
సూరి పాత్రలో దీక్షిత్ శెట్టి ఆకట్టుకున్నాడు. హీరోకి సమానమైన పాత్రలో మెప్పించాడు. కీర్తి సురేష్, నాని, దీక్షిత్ శెట్టి ముగ్గురూ ఈ సినిమాకి మూల స్తంభాలుగా నిలిచారు. వీళ్ల మధ్య నడిచే ముక్కోణపు ప్రేమకథ కొత్తగా అనిపిస్తుంది. షైన్ టామ్ చాకో ప్రతినాయకుడిగా మెప్పించాడు. సాయికుమార్, సముద్రఖని, పూర్ణ ఇంపార్టెంట్స్ రోల్ ప్లే చేశారు. నాని గ్రూప్‌లో సభ్యుడిగా కమెడియన్ రియాజ్‌కి మంచి రోల్ పడింది. కామెడీ సీన్‌లతో పాటు యాక్షన్ సీన్లలోనూ ఇరగదీశాడు రియాజ్. యాంకర్ సోనీ చౌదరికి ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ప్రతినాయకుడి కామదాహానికి బలైపోయిన యువతిగా బాగా నటించింది.
ఫైట్ మాస్టర్.. సతీష్ కూడా కొత్తేకానీ.. యాక్షన్ సీన్లు బాగా కుదిరాయి. ముఖ్యంగా బొగ్గుని దొంగతనం చేసే యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే రావణదహనం యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. సత్యన్ సూరన్ కెమెరా పనితనం దసరాకి మరో ప్లస్. తెరపై నాని, కీర్తి సురేష్‌లను కాకుండా.. ధరణి, వెన్నెలను చూస్తున్నంత సహజసిద్ధంగా వాళ్లని చూపించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌కి కావాల్సిన సహజత్వాన్ని తన కెమెరా కన్నుతో చూపించారు. ఓవరాల్‌గా ‘దసరా’ సినిమా పక్కా పైసా వసూల్ మూవీ. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం స్టార్ దర్శకుడు అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టైటిల్ :దసరా
నటీనటులు: నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయికుమార్,ఝాన్సీ తదితరులు
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి
చివరిగా: పక్కా మాస్ అండ్ పైసా వసూల్ మూవీ ‘దసరా’
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు