నటీనటులు: అశోక్, ఈషా, పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: విజయ్ కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర
దర్శకుడు: హరిప్రసాద్ జక్కా
దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘దర్శకుడు’. మరి ఈ దర్శకుడు ఆడియన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అయిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
మహేష్(అశోక్)కు చిన్నప్పటి నుండి సినిమాను డైరెక్ట్ చేయాలనేది కల. తన కలను నెరవేర్చుకోవడానికి ముందుగా ఓ సినిమాకు క్లాప్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మెల్లమెల్లగా సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపాదిస్తాడు. ఈ క్రమంలో అతడి కాస్ట్యూమ్ డిజైనర్ నమ్రతా(ఈషా)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అయితే ప్రతి విషయాన్ని సినిమా కోణంలో చూసే మహేష్ తన ప్రేమను కూడా అలానే చూస్తాడు. దీంతో కోపం తెచ్చుకున్న నమ్రతా అతడి నుండి దూరంగా వెళ్లిపోతుంది. అలానే తను కష్టపడి డైరెక్ట్ చేసిన సినిమాకు కూడా దూరంగా వెళ్లాల్సివస్తుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు కలిగింది..? అశోక్ ప్రేమ, సినిమా విషయాల్లో గెలవగలిగాడా..?
అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
స్వార్ధపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే దర్శకుడు హరిప్రసాద్ రాసుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ దాన్ని తెరపై ఆవిష్కరించే విధానంలో మాత్రం అనుభవలోపం కనిపిస్తోంది. బలమైన కథనాన్ని, సంభాషణలను రాసుకోలేకపోయాడు. అంతేకాదు నటీనటుల నుండి కావల్సినంత నటనను రాబట్టుకోలేకపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆర్టిస్ట్స్ ఎమోషన్స్ ను పలికించలేకపోవడంతో ఆ ఎమోషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వదు.
సినిమాను ప్రాణంగా భావించే కుర్రాడిలోని దర్శకుడికి, ప్రేమికుడికి మధ్య జరిగే సంఘర్షణను కూడా సరిగ్గా ఆవిష్కరించలేకపోయారు. హీరో, హీరోయిన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఈషా సహజ నటనతో ఆకట్టుకుంది. హీరో అశోక్ నటుడిగా మరింత పరిణితి చెందాల్సివుంది. అతడి పాత్రను డిజైన్ చేసిన తీరు మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమానే ప్రాణంగా భావించే వ్యక్తి తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను సినిమా కోణంలో ఎలా చూసాడనే పాయింట్ ఆసక్తికరంగా ఉంటుంది. కథ మొత్తం ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కమెడియన్ సుదర్శన్ ఆడియన్స్ ను నవ్విస్తాడు.
సినిమా మొదటి భాగంలో కామెడీ పెట్టడానికి చాలా స్కోప్ ఉంది. కానీ దర్శకుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రొటీన్ కథ, కథనాలతో సినిమాను నడిపించేశాడు. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. పాటలు గుర్తుపెట్టుకునే విధంగా లేనప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మెచ్చుకోదగిన విధంగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. మొత్తానికి దర్శకుడు చెప్పాలనుకున్న కథ కొత్తగా ఉన్నప్పటికీ, అనుభవలోపం కారణంగా దాన్ని తెరపై ఆకట్టుకునే రీతిలో చూపించడంలో సక్సెస్ కాలేకపోయారు.
రేటింగ్: 2/5