Daniel Balaji: ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ(48) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీలో నొప్పి కారణంగా నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వడ చెన్నై, కాక్క కాక్క, వేట్టైయాడు విళయాడు తదితర చిత్రాల్లో నటించారు.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాలలో నటించాడు. తెలుగులో ‘సాంబ’, చిరుత, టక్ జగదీశ్, ఘర్షణతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో సుమారు 50కి పైగా సినిమాలు చేశారు.
బాలాజీ ఎక్కువగా విలన్ పాత్రలలోనే కనిపించేవారు. ‘చిట్టి’ అనే తమిళ సీరియల్‌తో డేనియల్ బాలాజీ తన కెరీయర్ ప్రారంభించాడు. అదే సీరియల్ తెలుగులో ‘పిన్ని’ పేరుతో వచ్చింది. అప్పట్లో ఆ సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత ‘ఏప్రిల్ మదాతిల్’, ‘కాదల్ కొండెన్’ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు బాలాజీ. చివరిగా డేనియల్ ‘అరియవాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.