బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అతడి ఆత్మహత్యకు ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజమే కారణమని సాధారణ ప్రజల నుండి బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు కూడా వ్యాఖ్యానించటం చర్చకు దారితీస్తోంది. ఇక ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోల్స్ జరుగుతున్నాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… “జరిగిన దానికి కరణ్ జొహార్ ను విమర్శించడం హాస్యాస్పదం అన్నాడు. సినీ పరిశ్రమ ఎలా నడుస్తుందో తెలియక విమర్శిస్తున్నారు. సుశాంత్ తో ఇబ్బంది ఉన్నప్పుడు.. అతనితో పని చేయాలా, వద్దా అనేది కరణ్ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరితో కలిసి పని చేయాలనేది ప్రతి నిర్మాత సొంత నిర్ణయం. డబ్బు, పేరు వచ్చిన పన్నెండేళ్ల తర్వాత ఇండస్ట్రీలో దూరం పెడుతున్నారు అని సుశాంత్ ఫీల్ అయి సూసైడ్ చేసుకున్నాడని అనుకున్నట్టైతే.. సుశాంత్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన వ్యక్తులు రోజుకు కనీసం 100 మంది తనువు చాలించాలి. నీకున్న దానితో నీవు సంతోషంగా లేనప్పుడు.. నీకు ఎంత ఉన్నప్పటికీ సంతోషంగా ఉండలేవు. ఉద్ధవ్ థాక్రే, ములాయం వంటి రాజకీయవేత్తలు తమ కుమారులు, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు.. ముఖేశ్, అనిల్ కు ధీరూబాయ్ అంబానీ డబ్బు ఇచ్చినట్టు.. అన్ని కుటుంబాలు తమ సొంత వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు.. బాలీవుడ్ కుటుంబాలు కూడా వారి సొంత వ్యక్తులకు అదే ప్రాధాన్యతను ఇచ్చాయి. అసలు బంధుప్రీతీ లేనిదెక్కడ” అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.