భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన భర్త ఇంటిలోకి చొరబడి హంగామా సృష్టించిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి ఆమెను విడుదల చేశారు. హసీన్ జహాన్ ఆదివారం అర్థరాత్రి ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలోని సహస్ పూర్ గ్రామంలో తన భర్త షమీ ఇంటికి వెళ్లింది. ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిందిగా షమీ కుటుంబసభ్యులు సూచించడంతో ఆమె తన కూతురితో ఒక గదిలోకి చొరబడి తలుపులు వేసుకుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులు, ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పోలీసులు హసీన్ జహాన్ ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికి ఆమెను బెయిల్ పై విడుదల చేశారు.
‘నేను నా భర్త ఇంటికి వచ్చాను. ఇక్కడ ఉండేందుకు నాకు హక్కు ఉంది. నా అత్తారింటివాళ్లు నాతో సరిగా వ్యవహరించడం లేదు. పోలీసులు కూడా వాళ్లకే వత్తాసు పలుకుతున్నారు. వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయాలి. కానీ నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారని’ హసీన్ జహాన్ ఆరోపించింది. ఫాస్ట్ బౌలరైన షమీ ఇప్పుడు ఐపీఎల్-12లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి ఆడుతున్నాడు. ప్రపంచ కప్ కి కూడా ఎంపికయ్యాడు.