ఇప్పటి వరకు మనం విలువైన వస్తువులు, నగలు, డబ్బు చోరీ చేసిన కేసులు విన్నాం. కానీ మీరు పశువుల పేడను చోరీ చేసినందుకు ఎవరైనా అధికారిపై కేసు నమోదయినట్టు విన్నారా? కర్ణాటకలోని బిరూర్ లో ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. పేడ చోరీ చేశాడన్న ఆరోపణలపై ఒక అధికారిపై పోలీస్ కేసు నమోదైంది. పశుసంవర్ధక శాఖ సూపర్ వైజర్ పై ఉన్నతాధికారులు ఈ కేసు పెట్టారు. పేడ చోరీ కారణంగా సంబంధిత శాఖకు దాదాపుగా రూ.1.25 లక్షల నష్టం వాటిల్లినట్టు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల కథనం ప్రకారం సుమారు 30-40 ట్రాలీల పేడ పశుసంవర్ధక శాఖ నుంచి మాయమైంది. ఈ సంగతి తెలియగానే అధికారులు సూపర్ వైజర్ పై కేసు నమోదు చేశారు. పేడను కంపోస్ట్ ఎరువుగా వ్యవసాయానికి ఉపయోగిస్తారు. పేడతో తయారైన ఎరువుకు రైతుల నుంచి మంచి డిమాండ్ ఉంది. ‘పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ తరఫున ఆవు పేడ చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. అమృత్ మహల్ కవల్ దగ్గర నిల్వ చేసిన పేడలో 35-40 ట్రాక్టర్ల పేడ చోరీ అయినట్టు ఫిర్యాదు చేశారు. దీని విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని పేర్కొన్నట్టు’ సీపీఐ సత్యనారాయణ స్వామి వివరించారు. కేసు నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు పశుసంవర్ధక శాఖ సూపర్ వైజర్ ని అరెస్ట్ చేశారు. ఏ వ్యక్తి పొలంలో అయితే చోరీ అయిన పేడ దొరికిందో అతనిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొరికిన పేడను తిరిగి పశుసంవర్ధక శాఖ అధికారులకు అప్పజెప్పారు.