తమిళనాడులోని తూత్తుకుడి ఘటనపై సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసు విచారణకు మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ జగదీశన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మిషన్ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 25న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. గతేడాది తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో భాగంగా పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన రజనీ కాంత్ మాట్లాడుతూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అప్పట్లో దీనిపై వివరణ కోరగా చెప్పేందుకు రజనీ నిరాకరించారు. కానీ, తనకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే తాజాగా రజనీకి నోటీసులు జారీకావడంతో ఆయన వ్యాఖ్యలపై కమిషన్ వివరణ కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు కమిషన్ 379 మందిని ప్రశ్నించింది. ఆయా వివరాలను హైకోర్టు ముందుంచింది.