ప్రముఖ నటుడు శరత్ కుమార్ కు మద్రాస్ హైకోర్టు రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. కుదువపెట్టిన ఆస్తిని విక్రయించడానికి శరత్ కుమార్ ప్రయత్నించినట్లుగా గతంలో మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. శరత్ కుమార్, ఆయన సతీమణి రాధిక భాగస్వాములుగా ఉన్న మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థ గతంలో ‘ఇదు ఎన్న మాయం’ అనే సినిమాను రూపొందించింది. ఈ సినిమా నిర్మాణం కోసం రాడియన్స్ సంస్థ నుండి మూడేళ్ళ క్రితం అనగా 2014 లో కోటిన్నర రూపాయలను రుణంగా తెచ్చుకున్నారు. దీనికి 2015 మార్చిలోపు చెల్లిస్తామని చెప్పారు. అలా చేయని పక్షంలో ఈ సినిమాతో పాటు తరువాత నిర్మించబోయే సినిమా టీవీ హక్కులను రాడియన్స్ సంస్థకు అందించనున్నట్లు శరత్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఆ తరువాత కూడా మరో కోటి రూపాయలు అదనంగా తీసుకున్నారు.
దానికి తనఖా పెట్టిన ఆస్తులను కూడా విక్రయించడానికి ప్రయత్నించారని రాడియన్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ నుండి తీసుకున్న రెండున్నర కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించమని ఆదేశించాలంటూ కోర్టుని కోరింది. కేసును విచారించిన కోర్టు శరత్ కుమార్ కు రెండు లక్షల జరిమానా విధించింది.