తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తనవంతు సహాయం అందించడానికి యంగ్ హీరో నితిన్ ముందుకొచ్చాడు. రెండు రాష్ట్రాలకు రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించారు. కరోనా కట్టడికి 2 తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని నితిన్ ప్రశంసించారు. ప్రజలంతా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళాన్ని అందజేస్తున్నట్టు నితిన్ తెలిపారు. ప్రజలు అనవసర భయాందోళనలకు గురి కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను పాటించాలని, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ప్రభుత్వాలకు సహకరించాలని ప్రజలను కోరారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఏపీ, తెలంగాణలో రేషన్ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే పేదవారి కోసం రేషన్‌తో పాటు సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వాలు ఏపీలో రూ.1500, తెలంగాణలో రూ.1,000 సహాయం అందిస్తున్నాయి.