దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు రికార్డుస్థాయిలో విజృంభిస్తుంది. ఆదివారం ఉదయానికి దేశంలో ఈ మహమ్మారి బారనపడి మరణించిన వారిసంఖ్య 1301కి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 39,980కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 10,633మంది కోలుకోగా మరో 28,046 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రానికి 37,776గా ఉన్న కేసుల సంఖ్య ఆదివారం ఉదయానికి అనూహ్యంగా దాదాపు 2వేలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలోనే అత్యధికంగా ఈ వైరస్ తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,296చేరగా 521మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కేవలం ముంబయి నగరంలోనే ఇప్పటివరకు 8172 కేసులు నమోదవగా 322మంది బలయ్యారంటే వైరస్ ఎంతలా విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక గుజరాత్‌లో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 5054కి చేరగా ఇప్పటివరకు 262మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2846 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 151మంది మరణించారు. కేవలం ఒక్క ఇండోర్‌లోనే కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1568 చేరగా 76మంది మృత్యువాతపడ్డారు. దేశ రాజధాని ఢిల్లోలో ఇప్పటివరకు 4122 మందికి కరోనా సోకగా 64మంది మరణించారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 384కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 62పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1525కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 33మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 17కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరగా 29మంది మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.