ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దేశంలో కొవిడ్-19 బారినపడ్డవారి సంఖ్య 8,356కు పెరిగింది. గత 24 గంటల్లో 909 కొత్త కేసులు నమోదుకాగా, 34 మంది మృతిచెందారు. ప్రస్తుతం 7367 మంది ఆస్పత్రిలో కోలుకుంటుండగా.. 716 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 273కు పెరిగింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఏడు కేసులు గుర్తించడంతో ఆ రాష్ట్రంలో వైరస్ బారినపడ్డవారి సంఖ్య 27కు పెరిగింది. తమిళనాడులో శనివారం రాత్రి 45 ఏళ్ల మహిళ మృతిచెందడంతో అక్కడ మరణాల సంఖ్య 12కు చేరింది. ఇప్పటికే అమలులో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మరో రెండువారాల పాటు పొడిగించాలన్న ప్రతిపాదనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో కేసుల సంఖ్య భారీగా పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని వివిధ రాష్ట్రాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా వీటి జాబితాలో పశ్చిమ బంగాల్ కూడా చేరింది. అంతకుముందే పంజాబ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.