దేశంలో కరోనా అనుమానితులు పెరిగిపోతున్నాయి. జలుబు, తుమ్ములు, దగ్గు వంటివి కనిపిస్తే చాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హడావుడిగా హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. అయితే, ఏపీ లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదు కాలేదు. కానీ అనుమానితుల సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో హాస్పిటల్ కు వచ్చిన వారి రక్త నమూనాలను వైద్య అధికారులు పుణె ల్యాబ్ కు పంపుతున్నారు. అక్కడి నుంచి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 11 అనుమానిత కేసులు నమోదైనట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇందులో విశాఖలో 5, శ్రీకాకుళం 3, ఏలూరు, విజయవాడ, కాకినాడలో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్టు వైద్య అధికారులు చెప్తున్నారు. 11 అనుమానిత కేసులు నమోదైనట్టు తెలియగానే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, భయపడాల్సిన అవసరం లేదని, అన్ని పరిస్థితి అదుపులోనే ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది.