దేశంలో కరోనా బారిన పడ్డ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అయినా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. భారత్‌లో నిన్నటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు 107 ఉండగా ఇవాళ కేంద్రం ప్రకటించిన విరాల ప్రకారం అది 116కి చేరింది. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు మహారాష్ట్రలో 37 మంది బాధితులు ఉండగా, కేరళలో 23, ఉత్తరప్రదేశ్‌లో 12, హర్యానాలో 14, కర్ణాటకలో 6, ఢిల్లీలో 7, తెలంగాణలో 3, లద్దాఖ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 3, ఆంధ్రప్రదేశ్ 1, ఒడిశా 1, పంజాబ్ 1, రాజస్థాన్‌లో 2, తమిళనాడు 1, ఉత్తరాఖండ్‌లో ఒకరికి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో 17 మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇప్పటి వరకు 13 మంది డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారిపై ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. కరోనాపై వదంతులు ఎంతమాత్రం నమ్మొద్దని చెబుతున్నారు. అయితే వైరస్‌పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, చిన్న చిన్న చిట్కాలతో కరోనా వ్యాప్తిని అరికట్టొచ్చని సూచించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. కరోనాపై వస్తున్న వదంతులకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. కరోనా నివారణకు సమష్టిగా చర్యలు చేపట్టాలని
తెలిపారు. చేతులతో తరచుగా కళ్లను, ముఖాన్ని తుడుచుకోవడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని అందుకే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఒకవేళ మీకు వైరస్ వచ్చినట్టు ఏమాత్రం అనుమానంవచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని, మీకుటుంబ సభ్యులకు అది వ్యాపించకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రధాని మోదీ తన సందేశంలో తెలిపారు.