భారత్‌లో ప్రవేశించిన కరోనా వైరస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలను సైతం గడగడలాడిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం అప్రమత్తం అయ్యింది . హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో కరోనా కలకలం రేగడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణాలో ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్తున్నారు. రహేజా మైండ్ స్పేస్‌లో గల ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న టెకీ ఇటీవలే ఇటలీకి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో ఆ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. వైరస్‌కు సంబంధించిన లక్షణాలు బయటపడటంతో సదరు బిల్డింగ్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. అదే భవనంలో వున్న ఓపెన్ టెక్స్ట్ సంస్థ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, జన సమ్మర్ధం ఉన్నచోట వస్తువులను తాకొద్దని, ఎవరితోనూ కరచాలనం చేయవద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.