అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకు కనీసం పదివేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది. కేవలం 10 రోజుల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ను ముందుగా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అమెరికాకు మించిన భారమైంది. కరోనా మూడో దశకు వచ్చే వరకూ పట్టించుకోకపోవడం, పదేపదే చైనాపై నిందలు వేస్తూ సమయం వృధా చేయడంతో అమెరికా భారీ
మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో కరోనా ఈ స్థాయిలో విస్తరించాక చర్యలకు పూనుకోవడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది. అమెరికా ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు విశ్లేషకులు.
అమెరికాలోని 50 రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాపించింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలను మాత్రమే లాక్‌డౌన్ చేశారు. అమెరికా మొత్తం లాక్ డౌన్ చేయలేదు. విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. పరిశ్రమలు నడుస్తున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ, క్యాలిఫోర్నియా, ఫ్లోరిడా, వాషింగ్టన్ వంటి రాష్ట్రాలలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే లక్ష కరోనా కేసులు దాటిన దేశంగా అమెరికా ముందు వరుసలో ఉంది.