ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరులో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడంతో అతని రక్త నమూనాలను తిరుపతి వైరాలజీ కేంద్రానికి పంపారు. ఆ యువకుడు ఇటీవలే ఇటలీ నుంచీ వచ్చాడని తెలిసింది. ప్రస్తుతానికి అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు తెలిసింది. అతనికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చే సమయానికి అతనికి ఈ లక్షణాలు తగ్గడం గమనార్హం.
ఇక ఈ కేసుతో కలిసి దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి చేరింది. మహారాష్ట్రలో 11 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. పుణెలో 8 మందికి ఈ మహమ్మారి సోకింది. తెలంగాణలో 3 కేసులు నమోదు కాగా.. ఏపీలోని నెల్లూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వైరస్ వేగంగా విస్తరిస్తోన్న కారణంగా దేశంలోకి ప్రవేశించే వారిపై భారత్ ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 15 వరకు అన్ని దేశాల వీసాలను రద్దు చేసింది. బ్రిటన్ మినహా అన్ని దేశాల నుంచి రాకపోకలను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.