భారత్‌లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌గా కేసులల్లో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణం ముగించుకుని ఇండియా చేరుకున్న పలువురు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. తాజాగా బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తన తాజా చిత్రం బాజి షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లిన మిమి చక్రవర్తి మంగళవారం ఇండియా చేరుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడంతోపాటు, కరోనా వైరస్‌కు సంబంధించి ఇతర ఫార్మాలిటీలను కూడా పూర్తి చేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా 7 రోజుల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మిమి చక్రవర్తి ప్రకటించారు. ఈ 7 రోజులు పాటు ఎవరిని కలవకూడదని నిర్ణయం తీసుకున్నారు.
‘నేను యూకే నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చాను. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇంట్లో నన్ను కలవద్దని నా తల్లిదండ్రులకు చెప్పాను. నా తండ్రికి ఇప్పుడు 65 ఏళ్లు. 7 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. మనం ప్రస్తుతం చాలా కష్ట కాలంలో ఉన్నాం. కానీ తొందరలోనే ఈ పరిస్థితి మారుతుంది. ప్రభుత్వం చెప్పిన విధంగా శుభ్రత, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. భద్రత చర్యల్లో భాగంగా ఇతరులతో దూరంగా మెలగాలి’ అని తెలిపారు.