ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు చైనాలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా చైనా మొత్తం మీద అధికారికంగా 3,270 మంది చనిపోయారు. మొత్తం 81,093 మందికి కరోనా వైరస్ సోకగా వీరిలో 72,703 మంది దీని బారినుంచి బయటపడ్డారు. చైనా దేశంలోని వూహాన్ నగరంలో మొదటగా ఈ వైరస్‌ను గుర్తించారు. 2019 డిసెంబర్ 31 న 11 మిలియన్ల జనాభా కలిగిన వూహాన్ నగరంలో గుర్తు తెలియని వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
2020 జనవరి 11 వ తేదీన కరోనా వలన తొలి మరణం సంభవించింది. ఆ తరువాత జనవరి 22 వ తేదీన 17 మంది మరణించగా 550 మందికి వైరస్ సోకింది. ప్రమాదాన్ని పసిగట్టిన చైనా జనవరి 23 నుంచి వూహాన్ నగరాన్ని లాక్‌డౌన్ చేసింది. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దంటూ ఆంక్షలు విధించింది. ప్రజా రవాణాను నిలిపేసింది. రైళ్లు, బస్సులు, విమాన సర్వీసులను రద్దుచేసి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేని పరిస్థితిని కల్పించింది. బయటకు వచ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకుంది. 2 నెలల పాటు పెద్ద ఎత్తున యుద్ధం చేయడంతో కరోనా వైరస్ నుంచి చైనా బయటపడిందనే చెప్పాలి.
కరోనా బాధితులు రోజూ వందల సంఖ్యలో పెరుగుతూ ఉండే పరిస్థితి నుంచి చైనా బయటపడింది. చైనాలో ఇప్పుడు దాదాపుగా కరోనా కొత్త కేసులు నమోదు కావడం లేదంటే ప్రజలను కట్టడి చేయడంలో ఆదేశ ప్రభుత్వం సఫలమైంది. ఇప్పుడిప్పుడే వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆంక్షలు సడలింపు కూడా చేస్తున్నారు. అక్కడ దాదాపు 2 నెలలుగా మూసివేయబడ్డ కార్ల కంపెనీలు సైతం తెరుచుకుంటున్నాయి. కఠినమైన నిర్ణయాలుతీసుకోవడంతో పాటు కచ్చితంగా అమలుచేయడంతో కరోనా వ్యాప్తిని అరికట్టారని చెప్పొచ్చు. తాము కరోనాను జయించినట్లు అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వూహాన్‌లో ఇప్పుడు కరోనా కొత్త కేసులు నమోదు కాలేదని ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన వారిలో కొంతమంది కోలుకుంటున్నారని నేషనల్ హెల్త్ మిషన్ ప్రకటించింది.