భారత్‌లో కరోనా మహామ్మారి రోజురోజుకీ విజృంభిస్తుంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 3875 కొత్త కేసులు, 194 మరణాలు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా 46,711 పాజిటివ్ కేసులు, 1583 మరణాలు నమోదయ్యాయి. కాగా కరోనాతో పోరాడి కోలుకున్నవారి సంఖ్యా భారీగానే పెరుగుతుండటం విశేషం. ఒక్కరోజులోనే 1399 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 13,161గా ఉంది.
దేశంలోని మూడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 14,541 మందికి ఈ వైరస్ సోకగా.. వారిలో 2465 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 583కి చేరింది. వీటిలో ముంబయి మహానగరంలోనే అత్యధిక మరణాలు నమోదవ్వడం గమనార్హం. ఆ తర్వాత గుజరాత్‌లో 5804 కేసులు నమోదయ్యాయి. అక్కడ 1195 మంది కోలుకోగా.. 319 మంది మృత్యువాతపడ్డారు. ఢిల్లీలో 4898 కేసులు నమోదవ్వగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధానిలో కోలుకున్నవారి సంఖ్య 1431గా నమోదైంది.