భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 1819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 31,787కి చేరింది. వీరిలో 7797 మంది కోలుకున్నారు. 1008 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అధికంగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 9,318కి చేరింది. 400 మంది మృతిచెందారు.
ఏపీలోనూ కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 29 మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1332కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 343 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 283, కృష్ణా 236, నెల్లూరు 82, చిత్తూరు 77, కడప 69, ప్రకాశం 60, అనంతపురం 58, ప.గో 56, తూ.గో 40, విశాఖ 22, శ్రీకాకుళం జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌తో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. వివిధ ఆస్పత్రుల్లో 1014 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 7 కరోనా కేసులు మాత్రమే వెలుగుచూశాయి. దీంతో తెలంగాణ మొత్తంలో కరోనా బాధితుల సంఖ్య 1,016కి చేరింది. ఇవాళ 14 మంది చిన్నారులు సహా 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25 మంది కరోనాతో మృతిచెందారు. గత వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.