భారత్‌లో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశంలో 1553 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కి చేరింది. అలాగే 36 మంది మృతిచెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు రెట్టింపు లాక్ డౌన్‌కు ముందు 3.4 రోజులుగా ఉండగా ఇప్పుడు 7.5 రోజులుగా ఉందని చెబుతున్నారు. దేశంలో ఇప్పటివరకు 2,546మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 14 రోజుల్లో 59 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని వెల్లడించింది. కరోనా వైరస్ కేసులు రెట్టింపునకు ఏపీలో 10.6 రోజులు పడుతుండగా తెలంగాణలో 9.4 రోజులుగా ఉందని తెలిపింది. కేరళలో అయితే 72.2 రోజులు; ఒడిశాలో 39.8 రోజులుగా ఉందని తెలిపింది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్ ను సీఎం కేసీఆర్ మే 7వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా దేశం మొత్తం లాక్‌డౌన్‌ను సడలించినా తెలంగాణలో మాత్రం సడలించలేదు. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ సరఫరా సంస్థలకు కూడా అనుమతిని నిరాకరించారు. తాజాగా తెలంగాణాలో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 872కి చేరింది. ఇవాళ మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 23 మంది కరోనాతో మృతిచెందారు. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 186 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 663 మంది చికిత్సపొందుతున్నారు.