తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 644కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 52 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి కోలుకున్న వారు 110 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా వైరస్ ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు అవలంభించాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలుచేయాలని మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 483కి పెరిగింది. ఇప్పటి వరకు ఏపీలో 10,505 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 473 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 109 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలులో 91 కేసులు నమోదయ్యాయి. ఈనెల 12 వరకు 1.40 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తిచేసినట్లు అధికారులు ప్రకటించారు. 13 జిల్లాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 5,864 మంది క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు.