తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. ఇవాళ ఒక్కరోజు తెలంగాణలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 809కి చేరింది. ఇవాళ హైదరాబాద్‌లో 31 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గద్వాల 7, సిరిసిల్ల 2, రంగారెడ్డి 2, నల్గొండలో ఒకటి కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో కరోనాతో చికిత్సపొందుతున్న వారి సంఖ్య 605. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 18 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకుని 186 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 603కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారి సంఖ్య 546. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయినా ప్రజల వైఖరిలో మార్పు రావడం లేదు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా గుంటూరులో ప్రజలు ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేసి సీజ్ చేస్తున్నారు.