భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3970 మందికి కరోనా సోకింది. 103 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 85,940కి చేరుకుంది. 2,752 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని దేశవ్యాప్తంగా 30,153 మంది డిశ్చార్జి కాగా మరో 53,035 మంది చికిత్సపొందుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 1068 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్‌లో 606 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు రాష్ట్రాల్లో మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ప్రతిరోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1576 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 29,100కి చేరుకుంది. గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య 10 వేలకు చేరువలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ 4,595 మంది కరోనా బారిన పడ్డారు.
తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువుగా మారింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడానికి కోయంబేడు మార్కెట్ కారణం. కోయంబేడు మార్కెట్ లింకులతో ఇతర రాష్ట్రాల్లో సైతం కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులో కరోనా బాధితులు ఇప్పటి వరకు 10 వేలు దాటాయి. 71 మంది ప్రాణాలు కోల్పోయారు.