ఆంధ్రప్రదేశ్‌లోని 2 జిల్లాల్లోని ప్రజలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. కర్నూలు, గుంటూరు ప్రజలు కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రోజురోజుకూ వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ప్రజల్లో ఆందోళననెలకొంది. గత 24 గంటల్లో 60 కొత్తపాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 34 మంది ఈ 2 జిల్లాల్లోని వారే. కర్నూలు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 200 దాటిపోయింది. గుంటూరు జిల్లాలో 200 కి సమీపంలో ఉంది. ప్రతిరోజూ ఈ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారినపడి 25 మంది మృతిచెందారు. రాష్ట్రం మొత్తంలోని కరోనా పాజిటివ్ కేసుల్లో 46.74 శాతం కేసులు కేవలం ఈ రెండు జిల్లాల్లోనే నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 800 దాటిపోయింది.