ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ఇవాళ్టితో వెయ్యి దాటిపోయింది. గత 24 గంటల్లో 61 మందికి కరోనా సోకినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిప్రకారం శనివారం ఉదయానికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,061కి చేరింది. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాకు కరోనా మహమ్మారి పాకింది. ఇవాళ జిల్లాలోని పాతపట్నంలో ముగ్గురికి కరోనా సోకడంతో ఆందోళనకు గురిచేస్తోంది. కృష్ణా జిల్లాలో కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా 275 కరోనా పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. గుంటూరు 209, కృష్ణా 127, చిత్తూరు 73, నెల్లూరు 72, కడప 55, ప్రకాశం 53, అనంతపురం 51, ప.గో 39, తూ.గో 37, విశాఖ 22, శ్రీకాకుళం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనాతో ఇవాళ ఇద్దరు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 31 కి చేరింది.