భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం 21,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. గత 28 రోజులుగా 12 జిల్లాల్లో ఎక్కడా ఒక్కటి కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలిపారు. అలాగే గత 14 రోజుల్లో 78 జిల్లాల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 686 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరో 4,325 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 5,652 పాజిటివ్ కేసులు నమోదుకాగా, అక్కడ 269 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 2,407.. ఢిల్లీలో 2,248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కి చేరింది. తాజాగా మరో ముగ్గురు కరోనా మృతిచెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 27మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 234 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరులో 195, కృష్ణా 88, చిత్తూరు 73, నెల్లూరు 67, కడప 51, ప్రకాశం 50, అనంతపురం 42, ప.గో. 39, తూ.గో 32, విశాఖ 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.
మరోవైపు తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో 970కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 25 మంది కరోనా బారిన పడి మృతిచెందగా 262 మంది కోలుకున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో 9 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.