దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లెక్కల ప్రకారం భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 206కు చేరింది. ఈరోజు ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టు వృద్ధుడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో కరోనాతో మృతి చెందాడు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు భారతీయులు, ఒకరు ఇటలీ దేశస్తుడు. ఇప్పటికే కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌లో ఒక్కొక్కరు మృతిచెందిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి.
కరోనా వ్యాప్తిచెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ తమిళనాడు-కేరళ సరిహద్దులు మూసివేస్తున్నట్టు కోయంబత్తూర్ కలెక్టర్ ప్రకటించారు. స్పెయిన్ నుంచి వచ్చి కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన కుమారుడి విషయం గోప్యంగా ఉంచడంతో బెంగళూరులోని ఓ మహిళా అధికారిని రైల్వేశాఖ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం అతడు ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఐటీ సహా అన్ని ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ అవలంభించాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇళ్లలోనుంచి ఒక రోజు మొత్తం బయటకు రాకుండా ఎవరికి వారు కర్ఫ్యూ విధించుకోవడమే జనతా కర్ఫ్యూ. వచ్చే ఆదివారం ఉ. 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి సంఘటితంగా దేశమంతా కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అందరూ తమ తమ బాల్కనీలు,
గుమ్మాలు, కిటికీల వద్దకు వచ్చి చప్పట్లు కొడుతూ దేశంలో సేవ చేస్తున్న వారికి సంఘీభావం తెలపాలని కోరారు.