అలనాటి ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీహెచ్ రామారావు అనే వ్యక్తి ఘంటసాల జీవితాధారంగా బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఘంటసాల పాత్రలో ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నటిస్తున్నారు. ఆయన సతీమణి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటిస్తున్నారు. అయితే తమ తండ్రి జీవితాధారంగా సినిమా తీస్తున్నారన్న విషయం తమకు చెప్పలేదని చిత్రబృందంపై మండిపడుతున్నారు ఘంటసాల కుమారుడు, సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రత్నకుమార్.
ఈ సినిమా తీసేముందు తమను సంప్రదించలేదని, అనుమతి కూడా తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా బయోపిక్ తీయడాన్ని కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఘంటసాల ఎన్నో పాటలు పాడారు. సంగీత దర్శకుడిగానూ సేవలు అందించారు. 1970లో ఆయన్ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.