Nandamuri Balakrishna: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అది ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా రాజకీయాలు అయినా.. సందర్భం ఏదైనా ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటాడు. ఇక సెల్ఫీలు తీసుకోవటానికి వచ్చిన అభిమానుల ఫోన్‌లు విసరడం, వారిపై చేయి చేసుకోవడం మామూలే.
ఆమధ్య అక్కినేనిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అక్కినేని.. తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతకుముందు దేవ బ్రాహ్మణ సామాజిక వర్గంపైనా బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం వారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
రావణబ్రహ్మను దేవ బ్రాహ్మణులకు మూల పురుషుడిగా అభివర్ణించారాయన అప్పట్లో. దీనిపై ఆ సామాజిక వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. వారికి క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేశారు. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ తనకు అందిన సమాచారం తప్పు అని వ్యాఖ్యానించారు.
దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాక నర్సులపై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ పాల్గొన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 ఎపిసోడ్ లో నర్సులను కించపరిచేలా కామెంట్స్ చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. గతంలో తనకు జరిగిన బైక్ యాక్సిడెంట్ విషయాన్ని ప్రస్తావించారు బాలయ్య. కాలేజీ రోజుల్లో తాను కూడా బైక్స్ పై ఎక్కువగా తిరిగేవాడినని, రోడ్ క్రాస్ చేస్తూ వేగంగా వచ్చిన మరో బైక్ నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడ్డానని చెప్పారు.
ఒళ్లంతా రక్తంతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. యాక్సిడెంట్ జరిగినట్లు చెబితే లేనిపోని కేసులు అవుతాయనే ఉద్దేశంతో కాలుజారి కిందపడ్డానని చెప్పమని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారని చెప్పారు. ఆసుపత్రిలో తనకు ట్రీట్ మెంట్ ఇవ్వడానికి వచ్చిన నర్సు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దానెమ్మ ఆ నర్సు ఏమో భలే అందంగా ఉంది. ముఖం క్లీన్ చేస్తూ ఏమైంది? అని అడిగింది. నేనేమో యాక్సిడెంట్ అయిందని నిజం చెప్పేశాను’ అంటూ బాలయ్య అప్పటి విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఈ కామెంట్స్ నర్సులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. రోడ్డు ప్రమాదానికి గురై, రక్తమోడుతూ ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి తనకు వైద్యం చేయడానికి వచ్చిన నర్సు గురించి గౌరవంగా మాట్లాడాల్సింది పోయి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై వెంటనే బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సందర్భంగా కూడా బాలకృష్ణ తన వైఖరి చూపించాడు. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన తన అభిమానిపై చేయి చేసుకున్నాడు. తాజాగా మరో సారి బాలయ్య వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా జరిగిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫ్రీరిలీజ్ ఈవెంట్‌లో.. హీరోయిన్ అంజలిని బాలయ్య పక్కకు జరగమని చెప్పగా అంజలి నెమ్మదిగా జరుగుతుంది. దీనితో కోపం వచ్చిన బాలయ్య ఆమెను పక్కకు నెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, సెలబ్రెటీలు బాలయ్య తీరుపై ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ ప్రవర్తనపైఎన్ని విమర్శలు వస్తున్నా తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు.