మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని జారీ చేసింది. త్వరలోనే జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఐడీ కార్డును విడుదల చేసినట్టు తెలుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాద్యతలను నిర్వర్తించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. కానీ, రాజకీయం తన నుంచి దూరం కాలేదని ట్వీట్ చేసిన మరుసటి రోజే చిరంజీవికి పార్టీ ఐడీ కార్డును విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.