రాజేంద్రనగర్ టికెట్ ఆశించి భంగపడ్డ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఆయనకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. పార్టీలో చేరినప్పటి నుంచి పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు, రాజేంద్రనగర్ టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఓ చానల్లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.
అంతేకాకుండా ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. మహాకూటమి ఒప్పందంలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో గణేశ్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆ పార్టీ తరపున గణేశ్ గుప్తా బరిలోకి దిగుతున్నారు. దీంతో బుజ్జగింపుగా పార్టీ అధికార ప్రతినిధి పదవి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే బండ్ల గణేశ్ ఈ పదవితో సంతృప్తి చెంది పార్టీ ప్రచారంలో పాల్గొంటాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.