ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్.. ఆడియో టేపుల వ్యవహారంపై స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేసి వివరణ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగినితో అంటూ వచ్చిన ఆడియోలోని వాయిస్ తనది కాదన్నారు. తన వ్యాఖ్యలపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించాలన్నారు. లేనిపోని ఆరోపణలు సృష్టించి తన కుటుంబం ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. తనపై కక్షతోనే ఈ పనిచేశారని.. ఎవరు చేశారో, ఎందుకు చేశారో భగవంతుడికే తెలియాలని పృథ్వీ వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని వైసీపీ పెద్దలకు వివరించానన్నారు.
అమరావతి రైతులపై చేసిన వ్యాఖ్యలపైనా పృథ్వీ స్పందించారు. బినామీ రైతుల గురించే తాను మాట్లాడానని.. తన మాటలు నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అమరావతి రైతులపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. రైతులకు పృథ్వీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.