టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందానికి తెలుగు భాషపై .. తెలుగు సాహిత్యంపై మంచి పట్టుంది. తెలుగు మాస్టారుగా పనిచేసిన ఆయన, ఆ తరువాతనే నటనా రంగంలోకి వచ్చి, హాస్య నటుడిగా ఒక వెలుగు వెలిగారు. కొన్నేళ్ల పాటు బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు. హాస్య నటులలో ఆయన పోషించినన్ని పాత్రలను మరొకరు పోషించలేదనే చెప్పాలి.
బ్రహ్మానందం ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశారు. ఎంతోమంది హీరోలతో కలిసి నటించారు. ఇక ఆయన ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి బ్రహ్మానందం ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. తనకి ఇష్టమైన పెయింటింగ్స్ వేస్తూనే, తన ఆత్మకథను పూర్తిచేశారు.
తన ఆత్మకథకు ఆయన ‘నేను.. మీ బ్రహ్మానందం’ అనే టైటిల్ పెట్టారు. తన జీవితం.. అనుభవాలు .. అనుభూతులు.. జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారట. వచ్చేనెలలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలుస్తోంది. ఆయన కొనసాగించిన జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.