ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన దిశ హత్యోదంతం.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దిశ ద్విచక్రవాహనాన్ని పంక్చర్ చేసిన నలుగురు నిందితులు ఆమెను కిరాతకంగా హతమార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. దిశ తల్లిదండ్రుల ఆవేదన, బాధ చూస్తుంటే నిందితులను కాల్చేసినా తప్పులేదని దేశ ప్రజలంతా అనుకున్నారని తెలిపారు. తనకూ ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారని, చెల్లెలూ, భార్య ఉన్నారని చెప్పారు. వాళ్లకేదైనా జరిగితే ఒక తండ్రిగా తానెలా స్పందించాలి? అన్నారు. దోషులకు ఏ రకమైన శిక్ష పడితే ఉపశమనం కలుగుతుందో ఆలోచించాలన్నారు.
దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ పోలీసు అధికారులకు చట్టసభ వేదికగా జగన్ హ్యాట్సాప్ చెప్పారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సందర్భంగా మహిళల భద్రతపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతే లక్ష్యంగా కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచనతో శాసనసభ్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించడంలో భాగంగానే ఈ చర్చ చేపట్టినట్టు వివరించారు. మహిళలపై నేరాల నియంత్రణే లక్ష్యంగా బుధవారం విప్లవాత్మకమైన బిల్లును అసెంబ్లీలో తీసుకొస్తామని చెప్పారు.
‘అనుకోని పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇదే సినిమాల్లో జరిగితే.. హీరో ఏదైనా ఎన్‌కౌంటర్ చేయిస్తే అంతా చప్పట్లు కొడతాం. సినిమా బాగుంది.. హిట్ అవుతుంది. కానీ ఇదే నిజ జీవితంలో ఒక దమ్మున్నోళ్లు ఎవరైనా ఏదైనా చేస్తే జాతీయ మానవహక్కుల కమిషనట. ఢిల్లీ నుంచి పరుగెత్తుకొచ్చింది. జరిగింది తప్పట. ఇలా జరగకూడదట. ఎందుకు చేశారట అని నిలదీస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తోంది? ఢిల్లీలో ఘటన తర్వాత నిర్భయ చట్టం తెచ్చాం. నాలుగు నెలల్లో తీర్పు వచ్చి శిక్ష పడాలని చట్టం చెబుతోంది. కానీ ఏడేళ్లయి పోయింది. నిర్భయ దోషులకు మాత్రం శిక్ష పడలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మహిళా, చెల్లీ సత్వర న్యాయం కోసం ఎదురుచూస్తోంది. తమ పిల్లలకు ఏదైనా ఉపశమనం రావాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కూడా అదే దిశగా ఆలోచనలు చేస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కాల్చేయాలని ఎవరూ అనుకోరు. కానీ, న్యాయం జరగడంలో జాప్యం చూస్తున్నప్పుడు ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు అపనమ్మకం ఏర్పడుతుంది. ఆ సందర్భంలో నేరం చేసిన వారిని ఎవరైనా కాల్చేసినా వారిని హీరోలుగా భావించి చప్పట్లు కొట్టే పరిస్థితుల్లో మన సమాజం ఉంది. చట్టాలు మారాలి. ఏదైనా తప్పు జరిగితే స్పందించే ధోరణి మారాలి. తప్పులు జరిగితే వెంటనే స్పందించే పరిస్థితి రావాలి. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నిందితులను ఏం చేయాలనే దానిపై ఆలోచించాలి.
అన్ని ఆధారాలతో దొరికితే కొన్ని దేశాల్లో అయితే కాల్చేస్తారు. ఎక్కడైనా నేరం జరిగితే వారం రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. డీఎన్‌ఏ నివేదిక సహా అన్ని రిపోర్టులూ తెప్పించుకొని ఆ తర్వాత రెండు వారాలు లోపు విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో (వర్కింగ్ డేస్‌లో) నేరస్థులకు ఏకంగా ఉరిశిక్ష పడేలా చట్టాలు చేస్తే తప్ప సంతృప్తి రాదు. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. వేగంగా న్యాయం జరగాలి. ఈ దిశగా అడుగులు వేస్తాం. అంతేకాకుండా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై విచారణకు ప్రతి జిల్లాలోనూ ఒక డెడికేటెడ్ కోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఇలాంటి కేసులకు మాత్రమే ప్రత్యేకంగా ఈ కోర్టులు పనిచేసేలా చర్యలు తీసుకోవాలి” అని జగన్ అన్నారు.
”ఇక సోషల్ మీడియాను చూస్తే నాకు ఒక్కోసారి బాధ వేస్తోంది. ఏకపక్షంగా వేరే వ్యక్తులపై బురద జల్లడం కోసం మనస్సాక్షి లేకుండా దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవాళ్లను రక్షించే కార్యక్రమాలు జరగాలి. ఆడవాళ్ల గురించి నెగిటివ్‌గా పోస్ట్‌లు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ఉండాలి. ఆ దిశగా చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పోస్టింగ్‌లు ఏవైనా పెడితే సెక్షన్ 354 E ప్రకారం చర్యలు తీసుకొనే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇప్పటికే జీరో ఎఫ్‌ఐఆర్‌ను తీసుకొచ్చాం. చట్టం పరిధిలోకి దీన్ని తీసుకొస్తాం. మనిషి రాక్షసుడు ఎప్పుడవుతాడు? విచక్షణ ఎప్పుడు కోల్పోతాడు? అనేది గమనిస్తే.. మద్యం తాగిన మనిషికి నలుగురు జత కలిస్తే వారి ఆలోచనలు మారుతాయి. రాక్షసులవుతారు. ఇది జరగకూడదనే ఉద్దేశంతోనే ఏపీలో మద్యం దుకాణాలను విడతల వారీగా నిర్మూలించాం. గ్రామాల్లో 43వేల మద్యం దుకాణాలను రద్దు చేశాం. చిన్న పిల్లలను చెడగొడుతున్న పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌పై ఎన్ని నిషేధాజ్ఞలు ఉన్నా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటిలోనూ మార్పులు రావాలి. ఇవన్నీ చేస్తూ బుధవారం ఇదే చట్టసభలో మరో విప్లవాత్మక బిల్లు తీసుకొస్తామని సగర్వంగా చెబుతున్నా” అని జగన్ తెలిపారు.